fbpx

సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులకు త్వరిత గతిన నీటితో నింపాలి : జవహార్ రెడ్డి

Share the content

రాష్ట్రంలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనులు అన్ని గ్రామాల్లో పెద్ద ఎత్తున ఉపాధి పనులు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.రాష్ట్రంలో తాగునీరు,ఉపాధి హామీ పనులు,నీటి సరఫరా,విద్యుత్ సరఫరా పరిస్థితులపై మంగళవారం విజయవాడ లోని సిఎస్ క్యాంపు కార్యాలయం నుండి ఆయన జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….అన్ని గ్రామాల్లోను పెద్ద ఎత్తున ఉపాధి హామీ పనులు చేపట్టాలని అన్నారు.అలాగే ఉపాధి పనులు నిర్వహించిన కూలీలకు సకాలంలో కూలి సొమ్ము చెల్లించాలని ఆదేశించారు. తాగునీటి పరిస్థితులపై సిఎస్ సమీక్షిస్తూ ప్రకాశం బ్యారేజి నుండి మరియు నాగార్జున సాగర్ కుడి ప్రధాన కాలువ ద్వారా విడుదల చేసిన నీటితో సకాలంలో సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులను నింపాలని సంబంధిత జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు.అదే విధంగా గ్రామీణ,పట్టణ ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి గల ఆవాసాలు,కాలనీలకు ట్యాంకులు ద్వారా మంచినీటిని సరఫరా చేసే ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. ఇందుకు సంబంధించి క్షేత్ర స్థాయి పరిస్థితులను ఎప్పటి కప్పుడు పరిశీలించి ఎక్కడా తాగునీటికి ఇబ్బంది లేకుండా సకాలంలో అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సిఎస్ స్పష్టం చేశారు.అనంతరం రాష్ట్రంలో విద్యుత్ సరఫరా పరిస్థితులపై ఆయన సమీక్షించారు.విద్యుత్ సరఫరాకు సంబంధించి ప్రజల నుండి ఏవిధమైన ఫిర్యాదులు వస్తున్నది వాటిని ఎంత సమయంలో పరిష్కరిస్తుంది తదితర అంశాలపై ట్రాన్స్కో అధికారులను అడిగి తెలుసుకున్నారు.

రాష్ట్ర జల వనరులు,పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి ముఖ్య కార్యదర్శి శశి భూషణ్ కుమార్ మాట్లాడుతూ ….ఉపాధి హామీ పథకం కింద సోమవారం 22 లక్షల 59 వేల మంది కూలీలకు పని కల్పించినట్టు వివరించారు.ఉపాధి కూలీలకు 9వ తేదీ వరకు కూలి సొమ్ము చెల్లించామన్నారు.రానున్న రోజుల్లో పెద్ద సంఖ్యలో పనులు చేపట్టేందుకు వీలుగా తగినన్ని షెల్ఫ్ ఆఫ్ వర్క్సు అందుబాటులో ఉంచుకోవాలని కలెక్టర్లకు సూచించారు.తాగునీటి ఎద్దడి గల ఆవాసాలకు ట్యాంకులు ద్వారా మంచి నీటిని సరఫరా చేసేందుకు గాను 13 జిల్లాల కలెక్టర్ల నుండి ప్రతి పాదనలను వచ్చాయని వివరించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 234 ఆవాసాలకు ట్యాంకులు ద్వారా మంచి నీటిని సరఫరా చేస్తున్నట్టు తెలిపారు.

విద్యుత్ సరఫరా పరిస్థితులపై ఎపి జెన్కో ఎండి కెవిన్ చక్రధర్ బాబు మాట్లాడుతూ… రాష్ట్రంలో ప్రస్తుతం రోజుకు సరాసరిన 245 నుండి 250 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరుగుతోందని వివరించారు. విద్యుత్ డిమాండ్ కు అనుగుణంగా విద్యుత్ ను సరఫరా చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.వినియోగదారుల నుండి వచ్చే ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించడం జరుగుతోందని అన్నారు.ఈ సమావేశంలో ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్,జల వనరుల శాఖ ఇఎన్సి నారాయణ రెడ్డి,విపత్తుల నిర్వహణ సంస్థ డైరెక్టర్ ఆర్.కూర్మనాధ్, ఎస్పిడిసిఎల్ సిఎండి సంతోష్ రావు,గ్రిడ్ డైరెక్టర్ కెవి భాస్కర్, తదితర అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *