fbpx

విజయవాడ లోనే కే.ఆర్.ఎం.బి కార్యాలయం ఏర్పాటు చేయాలి : ఆళ్ల

Share the content

రాష్ట్ర ప్రభుత్వం కార్యనిర్వాహక రాజధాని నెపంతో కృష్ణ రివర్ బోర్డ్ మేనేజ్మెంట్ అథారిటీ (కే.ఆర్.ఎం.బి) కార్యాలయాన్ని విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలనే నిర్ణయం సహేతుకము కాదని సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు ఆళ్ళ వెంకట గోపాల కృష్ణారావు తెలిపారు. మంగళవారం హైదరాబాదులో జలసౌదా కే.ఆర్.ఎం.బి కార్యాలయంలో చైర్మన్ శివనందన్ కుమార్ ను కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….కృష్ణానదీ యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని విశాఖపట్నంకు తరలించాలనే వైసిపి ప్రభుత్వ ప్రతిపాదనను గతంలో కృష్ణ బోర్డ్ విముఖత వ్యక్తం చేసిందని తెలిపారు.. కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో ఏర్పాటు చేయాల్సిన బోర్డ్ ను కృష్ణా డెల్టాకు 400 కిలోమీటర్లు.. ఎన్.ఎస్.పి కి 700 కిలోమీటర్లు, శ్రీశైలానికి 800 కిలోమీటర్ల దూరంలో ఏ విధంగా ఏర్పాటు చేస్తారని ప్రశ్నించారు. గత తెలుగుదేశం ప్రభుత్వం.. బోర్డ్ ప్రధాన కార్యాలయాన్ని విజయవాడలోనే ఏర్పాటు చేయడానికి ఇబ్రహీంపట్నం ప్రాంతంలో భవనాలను పరిశీలించింది అని గుర్తు చేశారు.

వైసీపీ ప్రభుత్వం జూన్ 2020లో అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహాని విజయవాడలోనే కే.ఆర్.ఎం.బి కార్యాలయం ఏర్పాటు చేయడానికి కేంద్ర జల శక్తి శాఖ కార్యదర్శి కి లేఖ రాశారని పేర్కొన్నారు. 2019 నవంబర్ లోనూ… 2020 ఆగస్టులోనూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జలవనరుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ విజయవాడలోనే కే.ఆర్.ఎం.బి కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర జలశక్తి శాఖకు లేఖ రాశారని వెల్లడించారు. గతంలో కేంద్ర జల శక్తి శాఖ ఆంధ్రప్రదేశ్ ,తెలంగాణ ప్రభుత్వముల మధ్య జరిగిన నిర్ణయాలను పరిగణలోకి తీసుకుని కృష్ణా నది కింద ఉన్న 30 లక్షలు ఎకరాల ఆయకట్టుకు కే.ఆర్.ఎం.బి కార్యాలయాన్ని విజయవాడ లోనే ఏర్పాటు ఏర్పాటు చేయాలని కోరారు. కృష్ణానదీ యాజమాన్య బోర్డు పరిధిలోకి శ్రీశైలం, నాగార్జునసాగర్ ఉమ్మడి ప్రాజెక్టులును తుసుకువరావాటాన్ని స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు.

అదే జరిగితే….కృష్ణ నది ఎడారే

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు కేటాయించిన కృష్ణా జలాలను 50: 50 శాతంతో రెండు రాష్ట్రాలకు కేటాయింపులు జరపాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ,మాజీ మంత్రి మంత్రి హరీష్ రావు లు వ్యాఖ్యానించటాన్ని ఆయన ఖండించారు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు కేటాయించిన 811 టిఎంసి లలో 2015 జూన్ లో కే.ఆర్.ఎం.బి దగ్గర రెండు తెలుగు రాష్ట్రాల ఉన్నతాధికారులు చర్చించుకున్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కు 66 శాతం కేటాయింపులు తో.. 512 టీఎంసీలు, తెలంగాణకు 34 శాతం నీటి కేటాయింపులు తో 299 టిఎంసిలు కు తాత్కాలిక ఒప్పందం కుదిరింది అని తెలిపారు.ఇప్పటి వరకు ఉమ్మడి నీటి ప్రాజెక్టులైన శ్రీశైలం,నాగార్జునసాగర్ లో అందుబాటులో ఉన్న నీటి నిల్వలతో కేటాయింపులు జరుపుకుంటున్నారని గుర్తు చేశారు.

50: 50 శాతం వాటాలతో ఆంధ్రప్రదేశ్ అంగీకరిస్తే …శ్రీశైలం దిగువ భాగాన ఎస్.అర్. బీ.సి కింద ఉన్న రెండు లక్షల ఎకరాలు… నాగార్జునసాగర్ కుడి,ఎడమ కాలువల కింద ఉన్న 15 లక్షల ఎకరాలు …కృష్ణ డెల్టా కింద 13 లక్షల ఎకరాలు మొత్తం కూడా ..వర్షాభావ పరిస్థితుల్లో చుక్క నీరు రాకుండా మొత్తం బీడు బారిపోతుంది అని ఆందోళన వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో కృష్ణా తూర్పు డెల్టా ప్రాజెక్ట్ కమిటీ మాజీ చైర్మెన్ గుత్తా శివరామ కృష్ణ, నాగార్జున సాగర్ ఏడమకాలువ ప్రాజెక్ట్ కమిటీ మాజీ ఛైర్మెన్ యనమద్ది పుల్లయ్య చౌదరి,సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అంకాళ్ళ ప్రభు దాసు,గుడిపూడి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *