fbpx

కొత్తపల్లి దారెటు?

Share the content

ఒకప్పుడు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీని ముందుండి నడిపించిన కొత్తపల్లి సుబ్బారాయుడు రాజకీయ పయనం ఇప్పుడు ఎటు వెళ్తుందో అన్న అయోమయం నెలకొంది. టిడిపి ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షుడిగా వంటి చేత్తో పార్టీని ముందుండి నడిపించిన సుబ్బారాయుడు 2009లో ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీలోకి వెళ్లిపోయారు. కాంగ్రెస్లో ప్రజారాజ్యం విలీనం అనంతరం చాలా కాలం స్తబ్దుగా ఉన్న సుబ్బారాయుడు తర్వాత వైసీపీలోకి వెళ్లారు. అయితే ఇటీవల జిల్లాల విభజన సమయంలో నరసాపురం జిల్లా కేంద్రం చేయాలంటూ చేసిన నిరసనలో భాగంగా వైసీపీ అధిష్టానం మాట బేకాతలు చేయడంతో ఆయనను వైసీపీ పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.

ఇప్పుడు ఎటు వైపు?

కాపు నేతగా బలమైన అనుచర గణం ఉన్న కొత్తపల్లి సుబ్బారాయుడు డెల్టా ప్రాంతంలో కీలకమైన నేత. గతంలోనే ఆయన వచ్చే ఎన్నికల్లో పోటీలో ఉంటానని ఇప్పుడే ఏ పార్టీలో ఉంటాను అనేది చెప్పలేనని చెప్పకనే చెప్పారు. దీంతో కొత్తపల్లి సుబ్బారాయుడు ఏ పార్టీలోకి వెళ్తారు అనే ప్రశ్న అందరిలోనూ తోలుస్తోంది. కొత్తపల్లి సుబ్బారాయుడు దాదాపు తెలుగుదేశం పార్టీ లేదా జనసేన పార్టీలను ఎంచుకుంటారు అని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా నరసాపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీచేయాలని సుబ్బారాయుడు బలంగా భావిస్తున్నారు. ఇక్కడి నుంచి గతంలో పోటీ చేసి టీడీపీ తరపున గెలిచిన బంగారు మాధవ నాయుడు ప్రస్తుతం రాజకీయంగా స్తబ్దుగా ఉన్నారు. దీంతో టీడీపీ ఇన్చార్జి స్థానం వేరే ఒకరికి ఇచ్చినప్పటికీ ఇక్కడ స్థానం ఖాళీ ఉన్నట్లే. జనసేన పార్టీ తరఫున మాత్రం నరసాపురం స్థానం ఖాళీ లేదు అని చెప్పాలి. గతంలో జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన బొమ్మిడి నాయకర్ ప్రస్తుతం పార్టీలో యాక్టివ్గా ఉన్నారు. మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన నాయకర్ పార్టీలో కీలకమైన మత్స్యకార వికాస విభాగానికి చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. దీంతోపాటు పార్టీ కార్యక్రమాల్లోనూ చురుగ్గా ఉన్నారు. దీంతో నరసాపురంలో జనసేన పార్టీ ఇన్చార్జి సీటు ఖాళీ లేనట్లే. అయితే కొత్తపల్లి సుబ్బారాయుడికి మెగా ఫ్యామిలీతో దగ్గర సంబంధాలు ఉన్నాయి. చివరి నిమిషంలో ఏదైనా జరగొచ్చు అని అంచనా వేస్తున్నారు.

వస్తే మూడు స్థానాల్లో బలం

పశ్చిమగోదావరి జిల్లా డెల్టా ప్రాంతంలో కొత్తపల్లికి మంచి బలం ఉంది. కాపు సామాజిక వర్గంలో ఆయనకు మంచి పేరు ఉంది. నరసాపురం తో పాటు పాలకొల్లు, భీమవరం నియోజకవర్గాల్లో గణనీయంగా ఉన్న కాపు ఓటర్లు ఖచ్చితంగా సుబ్బారాయుడు ఏ పార్టీలోకి వచ్చిన అటువైపు సానుకూలంగా స్పందిస్తారు అని అంచనా. ఆయనతోపాటు ఆయన తమ్ముడు కొత్తపల్లి జానకిరామ్ కూడా ఈసారి ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. దీంతోపాటు కచ్చితంగా తమను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన వైసీపీకి బుద్ధి చెప్పాలని కొత్తపల్లి వర్గం బలంగా భావిస్తోంది. దీంతో ఈసారి కొత్తపల్లి అడుగులు కచ్చితంగా గెలిచే పార్టీ, వైసీపీకి బలంగా పోటీ ఇచ్చే పార్టీ వైపే ఉంటాయని భావిస్తున్నారు. త్వరలోనే ఆయన రాజకీయ రంగ పునప్రవేశంపై ఒక స్పష్టమైన ప్రకటన రావచ్చు అని భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *