fbpx

అంతర్వేది రధం దగ్ధం సంగతి ఏమైంది

Share the content

వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జాతీయస్థాయిలో అత్యంత వివాదాస్పదం అయినది అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి రథం దహనం సంఘటన. దీని తర్వాత వరుసగా జరిగిన ఆలయాల మీద దాడులు విగ్రహాల ధ్వంసం కూడా వైసీపీ ప్రభుత్వానికి మాయని మచ్చను తెచ్చిపెట్టాయి. అంతర్వేది రథం దగ్ధం తర్వాత దానిపైన అనేక అనుమానాలు, విమర్శలు రేగిన సమయంలో మొత్తం ఘటనను సిబిఐ కు అప్పగిస్తున్నామని అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దాని తర్వాత అసలు సీబీఐ ఏం తేల్చింది ప్రభుత్వం ఎందుకు వెనక్కు తగ్గింది..? అన్నది ఇప్పటివరకు బయటకు రాని బేతాళ ప్రశ్న.

కీలకం నుంచి సైలెంట్ వరకు

అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి రథం దహనం తర్వాత అంతే వేగంగా నూతన రథాన్ని తయారు చేసే పనిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పడింది. దీనిపై జాతీయ స్థాయిలో వైసీపీ ప్రభుత్వం మీద బీజేపీ అన్ని వైపుల నుంచి దాడి మొదలుపెట్టింది. ఏకంగా వైసీపీ ప్రభుత్వం సి.బి.ఐ దర్యాప్తు చేపిస్తామని కూడా ప్రకటించింది. రథం దగ్ధం కావడానికి కరెంటు వైర్లను ఎలుకలు కొరికేయడమే కారణం అని చెప్పడం, సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ కావడంతో వైసీపీ ప్రభుత్వ ప్రతిష్ట మరింత దిగజారింది. ఈ అంశంపై బీజేపీ కీలకంగా పోరాడుతుందని అంతా భావించారు. రధం దహనం తర్వాత వరుసగా ఆలయాల మీద జరిగిన దాడులు కూడా రాజకీయంగా వైసీపీకి వ్యతిరేకంగా బిజెపికి అనుకూలంగా జరిగాయి అన్నది కాదనలేని సత్యం.

బీజేపీ వదిలేసింది

అంతర్వేది రథం దహనం విషయాన్ని జాతీయ స్థాయి వరకు తీసుకువెళ్లిన బిజెపి తర్వాత ఈ విషయాన్ని పెద్దది చేస్తుందని రాజకీయ వర్గాలు భావించాయి. దాని తర్వాత జరిగిన ఘటనలతో బిజెపి మరింత పుంజుకొని పోరాడుతుంది అని వేసిన అంచనాలు పూర్తిగా తలకిందులు అయ్యాయి. అంది వచ్చిన అవకాశాన్ని బీజేపీ కొన్ని రాజకీయ కారణాలతో పక్కన పెట్టడం, తర్వాత ఈ అంశాలు పూర్తిగా సమస్య పోవడంతో వైసీపీ పక్కన పడినట్లు అయింది.

మర్చిపోయిన పెద్ద సంఘటన

కీలకమైన గోదావరి జిల్లాలో జరిగిన అంతర్వేది రధం దహనం ఘటన రాష్ట్ర రాజకీయ చరిత్రలోనే పెద్ద విషయం. దానిపై సిబిఐ వరకు ప్రభుత్వం వెళ్లాలని నిర్ణయించుకోవడం అంటే కచ్చితంగా అది రాజకీయంగా తమను ఇబ్బంది పెడుతుంది అని వైసిపి భావించడమే. కొన్ని రోజులు దీనిపై తీవ్రమైన చర్చ వాదోపవాదాలు జరిగినప్పటికీ ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన తర్వాత పూర్తిస్థాయిలో ఈ కేసు పక్కన పెట్టినట్లు అయింది. సిబిఐ విచారణ కాదు కదా కనీస విచారణ లేకుండానే కేసును మూసివేసినట్లు సమాచారం. బిజెపి ఈ కేసును పూర్తిగా వదిలేయడం తర్వాత వైసీపీ కూడా చాలా వేగంగా కొత్త రధాన్ని నిర్మించడంతో పూర్తిగా రాజకీయ మలుపు తిరుగుతుంది అనుకున్న అంతర్వేది రథం ఘటన కేసు సమసిపోయినట్లు అయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *