fbpx

యువతకు మరింత చేరువగా ‘ఎంప్లాయ్మెంట్ ఎక్స్ఛేంజ్ : బుగ్గన రాజేంద్రనాథ్

Share the content

రాష్ట్రంలో ఉన్న యువతీ యువకులకు ఉద్యోగావకాశాలు పెంచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. విద్యార్హత, అందుబాటులో ఉన్న ఉపాధి అవకాశాల సమాచారం తెలుసుకుని ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే వీలుగా వెబ్ పోర్టల్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆర్థిక, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ .. సోమవారం ‘ఎంప్లాయ్ మెంట్ ఎక్స్ఛేంజ్’ వెబ్ పోర్టల్ ను ఆవిష్కరించారు. ఎంప్లాయ్ మెంట్ ఎక్స్ఛేంజ్ నమోదులో గతంలో సీనియార్టిని బట్టి ఉద్యోగాల భర్తీ జరిగేదని..ఇప్పుడు మారుతున్న పరిస్థితులకు తగ్గట్లు వెబ్ పోర్టల్ ప్రారంభించడం యువతకు ఎంతో ఉపయోగపడుతుందని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వెల్లడించారు. ఉద్యోగం అనివార్యమనుకునే యువత ఎక్కడెక్కడో శోధించాల్సిన పని లేకుండా సమస్త సమాచారం, సమగ్ర రంగాలకు సంబంధించిన వివరాలను ఈ వెబ్ పోర్టల్ ద్వారా యువతకు మరింత చేరువ చేయడమే దీని ప్రధాన ఉద్దేశ్యమన్నారు. టెన్త్‌ దగ్గర నుంచి డిగ్రీ, డిప్లమో ఏది చేసినా సరే employment.ap.gov.in పోర్టల్ లో నమోదు చేసుకుంటే పూర్తి సమాచారాన్ని బట్టి ఆయా రంగాలలో గల ఉపాధి అవకాశాలు వెంటనే తెలుసుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

ఎంప్లాయ్ మెంట్ కార్డు లాగిన్ ద్వారా డౌన్లోడ్ చేసుకునే సదుపాయం కల్పించినట్లు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు. గతంలో ఎంప్లాయ్ మెంట్ రిజిస్ట్రేషన్ చేసుకునే వారికి ఉద్యోగవకాశాలలో ప్రాధాన్యత ఉండడం వలన రిజిస్ట్రేషనం నంబర్ ను పదిలంగా దాచుకునేవారని నాటి పరిస్థితులను మంత్రి బుగ్గన ప్రస్తావించారు. మంత్రి బుగ్గన సొంత నియోజకవర్గం డోన్ లోని ప్యాపిలి మండలంలో ఇటీవల స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ ను ఏర్పాటు చేసిన నేపథ్యంలో దానికి సమీపంలోని ఖాళీ స్థలంలో సెంటర్ కు అనుబంధంగా వర్క్ షాప్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని నైపుణ్య శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ ను ఆదేశించారు. కర్నూలు ఎయిర్ పోర్టులో పైలెట్ శిక్షణా కేంద్రంతో పాటు ఏరో స్పోర్ట్స్ హబ్ గా తీర్చిదిద్దడమే కాకుండా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు దిశగా మంత్రి బుగ్గన మార్గనిర్దేశం చేశారు.

ఇంజనీరింగ్, ఎంబీఏ, డిగ్రీ కోర్సులు సహా ఐ.టీ, టెక్నికల్ రంగాలపై యువత ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్న నేపథ్యంలో ‘ఎంప్లాయ్ మెంట్ ఎక్స్ఛేంజ్’ ను వారి అవసరాలకు పెద్దపీట వేస్తూ రూపొందించినట్లు నైపుణ్య శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ స్పష్టం చేశారు. ఈ ఆన్లైన్ సేవలు భారత ప్రభుత్వ నేషనల్ కెరీర్ సర్వీస్ పోర్టల్ తో అనుసంధానం చేసినట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వం, ప్రైవేట్ ఉద్యోగమేదైనా దానికి సంబంధించిన సమాచారం అధికారికంగా తెలుసుకుని, దరఖాస్తు చేసుకునేందుకు అనువుగా పోర్టల్ ను తీర్చిదిద్దినట్లు ఉపాధి, శిక్షణ శాఖ డైరెక్టర్ నవ్య పేర్కొన్నారు. ఆధార్, ఫోన్ నంబర్ ద్వారా లాగిన్ అయి విద్యార్హతల వివరాలను పోర్టల్ లో వెల్లడించగానే రిజిస్ట్రేషన్ నంబర్ మొబైల్ కి సందేశంగా వస్తుందన్నారు. అభ్యర్థుల వివరాలు జిల్లా స్థాయి అధికారికి చేరి, వారి ఆమోదంతో ఎంప్లాయ్ మెంట్ రిజిస్ట్రేషన్ నంబర్ తెలియజేయడం జరుగుతుందన్నారు.

ఐటీఐ, పాలిటెక్నిక్ కాలేజీ భవన నిర్మాణాల పురోగతిపై సమీక్ష

ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటివరకు 29 మోడల్ కెరీర్ సెంటర్ల స్థాపనకు రూ. 5 కోట్ల ప్రతిపాదనలను భారత ప్రభుత్వము ఆమోదించిందని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వెల్లడించారు. అందులో భాగంగా ఇప్పటికే 12 ఉపాధి కార్యాలయాలను మోడల్ కెరీర్ సెంటర్లుగా నవీకరించినట్లు స్పష్టం చేశారు. ఐటీఐ, పాలిటెక్నిక్ కాలేజీ భవన నిర్మాణాల పురోగతిపై ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సోమవారం సమీక్ష నిర్వహించారు. ఎంపీల నిధుల ద్వారా నిర్మాణం చేపడుతున్న ఐటీఐ కళాశాల భవనాలు అనంతపురం, చిత్తూరు, కర్నూలు, పశ్చిమగోదావరి జిల్లాలలో పూర్తయ్యాయి. కృష్ణా,గుంటూరు, నెల్లూరు జిల్లాలలో నిర్మిస్తోన్న ఐటీఐ కళాశాల భవనాలు తుది దశకు చేరాయి. కొత్తగా నిర్మించే భవన నిర్మాణాలకు సంబంధించి పలు అంశాలపై మంత్రి దిశానిర్దేశం చేశారు. రాజమండ్రి, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాలలో చేపడుతున్న ఐటీఐ భవన నిర్మాణాలు కూడా ముగింపు దశకు చేరాయి. విశాఖపట్నం, కడప జిల్లాలలో భవనాలు కడుతున్న స్థలాలు మారడం కారణంగా కొంచెం వెనుకబడినట్లు మంత్రి బుగ్గనకు నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *