fbpx

రాజుల ఓటు మాకొద్దు!!

Share the content

కొన్ని సామాజిక వర్గాలను వర్గ శత్రువులుగా ప్రకటించడం వైసీపీ అధినేత జగన్ బహిరంగం గానే చేస్తుంటారు. జగన్ బహిరంగంగా చెప్పకపోయినా క్షత్రియ సామాజిక వర్గం మాత్రం జగన్కు కాస్త దూరం అయిందని చెప్పొచ్చు. రాష్ట్రం మొత్తం మీద సుమారు రెండు శాతం పైగా క్షత్రియుల ఓట్లు ఉన్నాయి. ముఖ్యంగా ఉభయగోదావరి జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లో ఆ ఓట్లు గణనీయంగా ఉన్నాయి. వీరంతా వైసిపికి దూరంగా ఉన్నారని వైసీపీ నాయకులే చెప్పడం… పార్టీ అధినేత సైతం క్షత్రియ సామాజిక వర్గానికి సరైన ప్రాతినిధ్యం కల్పించకపోవడం రాజుల ఓట్లను వైసీపీ వద్దనుకుంటుందా అనే అనుమానాన్ని కలిగిస్తోంది. జగన్ ప్రభుత్వ మొదటి క్యాబినెట్లో క్షత్రియ సామాజిక వర్గం నుంచి ఆచంట ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజుకు మంత్రి పదవి దక్కింది. ఆ తర్వాత జరిగిన మంత్రివర్గ విస్తరణలో మంత్రివర్గంలో క్షత్రియ సామాజిక వర్గం నుంచి ఎవరికి అసలు చోటు దక్కలేదు. మొదట్నుంచి జగన్ కుటుంబానికి అండదండగా ఉన్న నరసాపురం ఎమ్మెల్యే ప్రసాద్ రాజుకు మంత్రివర్గంలో ఖచ్చితంగా స్థానం లభిస్తుంది అని భావించారు. అయితే దానిని కూడా జగన్ ఏమాత్రం పట్టించుకోకుండా ప్రసాదరాజుకు చీఫ్ విప్ పదవి ఇచ్చి మమ అనిపించారు. ఇది క్షత్రియులు మరింత అసహనాన్ని రేపింది అని చెప్పొచ్చు.

రఘురామకృష్ణం రాజు ఉదంతం తర్వాత

వైసీపీ ప్రభుత్వానికి మొదటి నుంచి కొరకరాని కొయ్యగా మారిన నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు వదంతం తర్వాత క్షత్రియ సామాజిక వర్గంపై ముఖ్యమంత్రి జగన్ అక్కసు చూపిస్తున్నారు అన్నది రాజకీయ వర్గాల మాట. రఘురామకృష్ణంరాజు ఎగురవేసిన తిరుగుబాటులో పూర్తిస్థాయిలో జగన్ క్షత్రియ సామాజిక వర్గం ఎగురవేసిన తిరుగుబాటుబావుటాగా భావించారు. దీంతోనే ఆ వర్గానికి సంబంధించిన నేతలను ఆయన దూరంగా పెడుతూ వచ్చారు. ఒక సామాజిక వర్గం నుంచి ఒక నేత వైసీపీ మీద తిరుగుబాటు చేస్తే, అది మొత్తం సామాజిక వర్గం మీదకు రాదు. అయితే విభిన్న మనస్తత్వం కలిగిన జగన్ మాత్రం మంత్రివర్గంలో క్షత్రియులకు చోటు కల్పించలేదు. ఆ వర్గం నేతలను దూరం పెడుతూ వచ్చారు. రఘురామకృష్ణం రాజు చేసిన తప్పు మొత్తం ఆ సామాజిక వర్గం చేసిన తప్పుగా జగన్ భావించడం వల్లే ఇది జరిగింది అన్నది వైసీపీ నేతల అంతర్గత చర్చ.

ఉభయగోదావరి జిల్లాల్లో కీలకం

క్షత్రియ సామాజిక వర్గం ఓట్లు ఉభయగోదావరి జిల్లాలో ఎక్కువగా కనిపిస్తాయి. ముఖ్యంగా భీమవరం నియోజకవర్గంలో కాపుల ఓట్లకు దీటుగా క్షత్రియులు ఓట్లు ఉంటాయి. అలాగే నరసాపురం, ఉండి, పాలకొల్లు, ఆచంట, కొత్తపేట, రాజమండ్రి నియోజకవర్గాల్లోనూ వీరు ఓట్లు చాలా గణనీయమైన స్థాయిలో కనిపిస్తాయి. మిగిలిన ప్రాంతాల్లోనూ క్షత్రియులు ఓట్లు ఉన్నప్పటికీ వారు అంత ప్రభావశీలంగా ఉండరు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోనూ రాజుల ఓట్లు ఎక్కువగానే కనిపిస్తాయి. వీరందరినీ ఇప్పుడు జగన్ కాదు అనుకుంటున్నారా అన్నది ప్రధాన ప్రశ్న. కొన్ని సంఘటనలు జరిగిన వెంటనే వారిపై విపరీతమైన ద్వేషం పెంచుకోవడం, ఆ సామాజిక వర్గాలకు పూర్తిస్థాయిలో అణగదొక్కే చర్యలు తీసుకోవడం జగన్ కొత్త రాజకీయం. మరి ఈ కొత్త రాజకీయంలో క్షత్రియులు ఎటువైపు ఉంటారు వచ్చే ఎన్నికల్లో వారి ఓటు ఎటువైపు పడుతుంది అన్నది వేచి చూడాల్సిన విషయం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *