fbpx

సమగ్ర శిక్ష జేఏసి నాయకులతో చర్చలు జరపాలి

Share the content

గత పది రోజులుగా సమ్మె చేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులకు నోటీసులు ఇవ్వడం ద్వారా, మెమోలు పంపడం ద్వారా ఉద్యమాన్ని ఆపలేరని యుటి ఎఫ్, జన విజ్ఞాన వేదిక నాయకులు తెలిపారు. అధికారులు ఇచ్చిన నోటీసులను శుక్రవారం కాకినాడ లోని అంబేద్కర్ విగ్రహం వద్ద దగ్ధం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బెదిరింపులతో ఉద్యమాన్ని ఆపలేరంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఈ శిబిరానికి యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి చక్రవర్తి, జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి కె.ఎం.ఎం.ఆర్ ప్రసాద్, సామర్లకోట యూటీఫ్ అధ్యక్షురాలు ఎంబిఎం బిబి నాంచారిదేవి మద్దతు తెలిపి మాట్లాడుతూ..రాష్ట్రంలో ఏ చిన్న ఉద్యమం జరిగినా సమస్యలు పరిష్కరించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం, ఉద్యమాల అణిచివేతకే అధిక ప్రాధాన్యతని ఇస్తుందని విమర్శించారు. అందులో భాగంగానే సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులకు నోటీసులు పంపి విభజించు పాలించు అనే బ్రిటిష్ సూత్రాన్ని అనుసరిస్తుందని పేర్కొన్నారు.. ఇలాంటి తాటాకు చప్పుళ్ళకు ఉద్యోగులు ఏమాత్రం ఆందోళన చెందవద్దని, మీ ఉద్యమం విజయవంతం అయ్యేదాకా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న యుటిఎఫ్ టీచర్లు మీకు సంపూర్ణ మద్దతుగా నిలబడతారని తెలియజేసారు.

తక్షణం సమగ్ర శిక్ష ఉద్యోగుల జేఏసీ నాయకత్వాన్ని చర్చలకు పిలిచి అన్ని డిమాండ్లు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉద్యోగులు సుదీర్ఘ పోరాటాలకు సిద్ధపడాలని పిలుపునిచ్చారు. జగన్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే వ్యక్తులు చేసే తప్పుడు ప్రచారాలను నమ్మోద్దని, వాస్తవాలతో బలంగా తిప్పికొట్టి నోరెత్తకుండా చేయాలని, మీ డిమాండ్లు న్యాయమైనవే కాకుండా చట్టబద్ధమైనవి కూడా అని తెలియజేశారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి అహర్నిశలు కష్టపడే ఉద్యోగుల పట్ల నిరంకుసంగా వ్యవహరించడం తప్పని ప్రభుత్వానికి హితవు పలికారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం యూటీఫ్ అధ్యక్షులు కరుణాకరన్, సీతారామారావు, జిల్లా ఐక్య ఉపాధ్యాయ పత్రికా కన్వీనర్ పి. గిరిగోపాల్ శర్మ మాట్లాడి ఆర్ధిక సహకారం అందించారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్ మరియు సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ జిల్లా అధ్యక, కార్యదర్సులు ఎం.చంటిబాబు, సత్య నాగమణి, జేఏసీ జిల్లా ఉపాధ్యక్షులు పివివి మహాలక్ష్మి, ఏ.లోవరాజు, సహాయ కార్యదర్సులు జి.నారాయణ, శ్రీనివాస్, జిల్లా కోశాధికారి పి.రాజు, ఎం.గంగాధర్, రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *