fbpx

బిసిలకు శాశ్వత కుల ధృవీకరణ పత్రాలు అందచేస్తాం

Share the content

వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బీసీ సోదరులను తీవ్రంగా ఇబ్బంది పెట్టిందని, ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి బీసీల ద్రోహని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. శుక్రవారం టిడిపి రాష్ట్ర కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ..వైకాపా పాలనలో బీసీలకు జరిగిన అన్యాయంపై వారిలో చైతన్యం కల్పించేందుకు జనవరి నాలుగు నుంచి ‘జయహో బీసీ’ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమం రెండు నెలల పాటు కొనసాగుతుందని, తొలి విడతలో పార్లమెంట్‌, అసెంబ్లీ నియోజకవర్గాలు, మండలాల్లో తెదేపా నేతలు పర్యటిస్తారని తెలిపారు. క్షేత్రస్థాయి పర్యటనలోనే బీసీల కష్టాలు తెలుసుకుంటామని వెల్లడించారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసిలకు 10 శాతం రిజర్వేషన్‌ తగ్గించి,16 వేల మంది బీసీలకు అవకాశాలు లేకుండా చేశారని మండిపడ్డారు. 8 వేల ఎకరాల బీసీల అసైన్డ్‌ భూములను కూడా వెనక్కి తీసుకుందన్నారు. ఆదరణ పథకాన్ని రద్దు చేసిందని వెల్లడించారు.ఆదరణ పథకం ద్వారా పనిముట్లు అందడం లేదని బిసి సోదరలు యువగళం పాదయాత్రలో చెప్పారని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 217 ను తీసుకొచ్చి మత్స్యకారుల వెన్నెముక విరగ్గొట్టిందని ఆందోళన వ్యక్తం చేశారు. పట్టు రైతులకు కనీసం సబ్సిడీ ఇచ్చే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదని ఎద్దేవా చేశారు.

బీసీ సోదరుల తరఫున పోరాడుతున్న.. యనమల రామకృష్ణుడు, అయ్యన్న పాత్రుడు, కొల్లు రవీంద్ర, అచ్చెనాయుడుపై అక్రమ కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రొద్దుటూరులో తెదేపా నాయకుడు నందం సుబ్బయ్యను హత్య చేశారని పేర్కొన్నారు. బిసిలు బలహీనులు కాదు.. బలవంతులన్నదే తెలుగుదేశం నినాదమని పేర్కొన్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి బీసీలకు సముచిత స్థానం కల్పించింది తెలుగుదేశమేనని వెల్లడించారు. బీసీలకు రక్షణ చట్టం పేరిట “మినీ మేనిఫెస్టోలో” ఇప్పటికే ప్రాధాన్యమిచ్చామన్నారు. తెదేపా అధికారంలో వచ్చాక బీసీలకు శాశ్వత కుల ద్రువీకరణ పత్రాలు అందజేస్తామని హామీ ఇచ్చారు. బీసీ ఉపకులాలకు ప్రత్యేక నిధి ఏర్పాటు చేసి వారికే ఖర్చు చేస్తామని పేర్కొన్నారు.అనంతరం రాష్ట్ర స్థాయిలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి బీసీల కోసం ప్రత్యేక మేనిఫెస్టోను తెదేపా అధినేత చంద్రబాబు విడుదల చేస్తారని వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *