fbpx

ఆంధ్రప్రదేశ్ పై హస్తం విసరనున్న బాణం ?

Share the content

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ కు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేవారి జాబితాలో తనకు ఒక స్థానం ఉంటుందని వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్.షర్మిల అన్నారు. అసెంబ్లీ ఫలితాలకు ముందు రోజున పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పై విధంగా వ్యాఖ్యానించారు.కేసీఆర్ ఓటమి కోసమే ఎన్నికల్లో పోటీ చేయలేదని,అందుకు అనుగుణంగానే ఫలితాలు రానున్నాయని ఆమె తెలిపారు.అంతకముందు ఎన్నికల నామినేషన్ సమయంలో అనూహ్యంగా పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడమే కాకుండా, కాంగ్రెస్ కు మద్దతు తెలుపుతున్నట్లు వెల్లడించారు. ఆమె నిర్ణయం పై సొంత పార్టీ నేతలు కొందరు అసహనం వ్యక్తం చేస్తూ పార్టీకి రాజీనామా చేశారు.పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న గట్టు రామచంద్రరావు,పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు అధినేత్రి నిర్ణయాన్ని తిరస్కరిస్తూ మూకుమ్మడిగా రాజీనామా చేశారు. మెజార్టీ క్యాడర్ అంతా బిఆర్ఎస్ పార్టీలో చేరారు. అయినా ఆమె తను తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నారు. అంతిమంగా ఎన్నికల్లో పోటీ చేయకుండా కాంగ్రెస్ గేలుపులో పరిమిత పాత్ర వహించారు.మొదటి నుంచి ఎన్నికల్లో పొత్తుకు షర్మిళ ప్రయత్నాలు చేసినా, కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి తీవ్ర అభ్యంతరం తెలిపారు.షర్మిళ రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ కు మాత్రమే పరిమితం కావాలని,ప్రస్తుత పరిస్థితుల్లో పొత్తు ద్వారా జరిగే లాభం కంటే నష్టం ఎక్కువ ఉంటుందనీ ఢిల్లీ పెద్దలుకు ఖరాకండీగా చెప్పేసారు. వచ్చే వారిని రావద్దు అని చెప్పలేక, రాష్ట్ర పార్టీ నిర్ణయాన్ని కాదనలేక కాంగ్రెస్ ఢిల్లీ అధిష్టానం ఈ నిర్ణయాన్ని కొన్ని రోజులు వాయిదా వేస్తూ వచ్చింది. షర్మిలకు రాజకీయ భవిష్యత్తు హామీ ఇస్తూ,ప్రస్తుత ఎన్నికల్లో పోటీని విరమించుకోవాలని కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేసింది.

కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అమలు చేసిన కేసీఆర్ వ్యతిరేఖ ఓటు ఫార్ములా ను దేశ రాజకీయాల్లో ఇండియా కూటమి విజయం కోసం మోదీ వ్యతిరేఖ ఓటు ను ప్రజల్లోకి తీసుకువెళ్ళే ప్రయత్నాలు మొదలు పెట్టింది.అందులో భాగంగానే మొదట కాంగ్రెస్ పార్టీ బలపడేందుకు వ్యూహాలు రచిస్తుందని సమాచారం. సౌత్ లో ఉన్న 129 ఎంపి స్థానాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ 50_60 స్థానాలు గెలిచే విధంగా ఇంఛార్జీలను నియమిస్తూ పక్కా వ్యూహాలు రచిస్తోంది. తెలంగాణలో పది స్థానాలు,తమిళనాడులో డిఎంకె మద్దతు తో పది స్థానాలు,కేరళ ,కర్ణాటక లలో 30 స్థానాలు గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తుంది. సౌత్ లో అన్ని రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉన్నది. వైసిపి ఆవిర్భావంతో కాంగ్రెస్ ఓటు బ్యాంక్ ను తీసుకువెళ్లిన సిఎం జగన్మోహన్ రెడ్డికి చెక్ పెట్టే విధంగా కాంగ్రెస్ పార్టీ అతి త్వరలోనే కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్లు సమాచారం.

  • కాంగ్రెస్ పూర్వ ఓటింగ్ పై ఢిల్లీ పెద్దల దృష్టి
    కర్ణాటక,తెలంగాణ రాష్ట్రాల్లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మీద దృష్టి కేంద్రీకృతం చేయనున్నది.కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి అండగా ఉన్న క్రిస్టియన్,మైనారిటీ,రెడ్డి,ఇతర సామాజిక వర్గ ఓట్లపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు అని సమాచారం. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పిసిసి పగ్గాలు అతి త్వరలోనే షర్మిళకు ఇవనున్నట్లు సమాచారం.కర్ణాటక నుంచి రాజ్యసభ అవకాశం ఇచ్చి, ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షులుగా కొనసాగుతూ పార్టీని బలోపేతం చేసే విధంగా షర్మిళ ను దింపనున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
  • వైసిపి అసంతృప్తులుకు వేదిక కానున్న కాంగ్రెస్
    గతంలో కాంగ్రెస్ పార్టీతో అనుబంధం ఉండి,వైసిపి ఆవిర్భావం తరువాత ఆ పార్టీలోకి వెళ్ళిన నేతలను కాంగ్రెస్ పార్టీ సునిశితంగా గమనిస్తుంది.మరో వైపు వైసిపిలో సీట్ల బదిలీ నిర్ణయం సీనియర్ నేతలను కలవరపెడుతోంది. జగన్మోహన్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన బాలినేని శ్రీనివాసుల రెడ్డి వంటి సీనియర్ నేతలుకే సీట్ల బదిలీ విషయం ఆగ్రహం తెప్పిస్తుంది. హైదరాబాద్ లో తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డిని బాలినేని శ్రీనివాసరెడ్డి,మాగుంట శ్రీనివాసరెడ్డి కలిసారన్న వార్తలు వెలుగులోకి వస్తున్నాయి.వైసిపి సభ్యత్వానికి, ఆ పార్టీ నుంచి సంక్రమించిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా షర్మిళ రాకతో అతి త్వరలోనే కాంగ్రెస్ పార్టీ లోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
  • పదకొండు స్థానాల్లో నియోజకవర్గ ఇన్చార్జి లను నియమించిన వైసిపిపై సొంత నేతలు భగ్గుమంటున్న వేళ, రానున్న రెండవ,మూడవ,నాల్గవ లిస్టులో ఇంకా ఎంతమంది ధిక్కార స్వరం వినిపిస్తారో అని వైసిపి పెద్దలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. క్రిస్మస్ లోపు గోదావరి జిల్లాల అభ్యర్థుల ప్రకటన,సంక్రాంతి లోపు మొత్తం 175 స్థానాలు ప్రకటన ఉంటుందన్న వార్త వినిపిస్తున్నప్పటకి ఆ విధంగా వైసీపీలో అడుగులు పడటం లేదు. షర్మిళ రాజకీయాలు ఎక్కడ నుంచి మొదలు అవుతాయి,ఎవరి మీద బాణం విసరపోతున్నారో మరో నెల రోజుల్లో పూర్తి ఎన్నికల వాతావరణంలో స్పష్టం అయ్యే అవకాశం ఉందని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *