fbpx

అగ్రిగోల్డ్ బాధిత కుటుంబాలకు పది లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలి

Share the content

అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా సోమవారం ఉదయం కాకినాడ కలెక్టరేట్ కార్యాలయం దగ్గరలో ధర్నా నిర్వహించారు. ముందుగా స్థానిక బాలాజీ చెరువు సెంటర్ నుండి తహసిల్దార్ కార్యాలయం,జిజిహెచ్, జడ్పీ సెంటర్ మీదుగా ప్రదర్శన చేస్తూ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోకి చొచ్చుకుని వెళ్లేందుకు ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డగించారు. ఈ సంఘటనలో పోలీసులకు,అగ్రిగోల్డ్ బాధితులకు తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకున్నది. ఈ ధర్నాకు ముఖ్య అతిథులుగా సిపిఐ జిల్లా కార్యదర్శి కామిరెడ్డి బోడకొండ, సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్ లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతిపక్ష నాయకుని హోదాలో జగన్మోహన రెడ్డి 2017 మార్చి 23న ఆమరణ దీక్ష చేస్తున్న వారిని పరామర్శించి,తమ ప్రభుత్వం వచ్చాక మరణించిన బాధిత కుటుంబాలకు పది లక్షల ఎక్స్ గ్రేషియా ఇస్తామన్న హామీని తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. అగ్రిగోల్డ్ కు అటాచ్ చేసిన లక్షలాది కోట్ల ఆస్తులను ప్రభుత్వమే కనుగోలు చేసి, ఆ మొత్తాలను బాధితులకు చెల్లించాలని వారు డిమాండ్ చేశారు.

కే .శ్రీనివాస్ మాట్లాడుతూ అగ్రిగోల్డ్ బాధితుల ఆర్తనాదాలు ముఖ్యమంత్రికి వినబడడంలేదా అని ప్రశ్నించారు. అగ్రిగోల్డ్ కంపెనీ ఆస్తులు అన్నిటికీ ప్రభుత్వం పూర్తిస్థాయి రక్షణ కల్పించి, వాటిపై వచ్చే ఆదాయాన్ని కోర్టుకు లేక ఎస్పివికి జమ చేయాలని కోరారు. దాచుకున్న ఆస్తులు అన్నిటిని ప్రభుత్వమే స్వాధీనం చేసుకోవాలని, కంపెనీ తప్పుడు పనులకు సహకరిస్తున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.అగ్రిగోల్డ్ గ్రూప్ ఆఫ్ కంపెనీలు పలు స్కీములు పేరుతో విక్రయించిన ఇంటి స్థలాలు, అపార్ట్మెంట్ ప్లాట్లు, వ్యవసాయ భూములు కొన్నవారికి తక్షణమే రిజిస్ట్రేషన్ చేయించి పూర్తి హక్కులు కల్పించాలని తెలిపారు. కొంత మొత్తంలో చెల్లించిన వారికి మిగిలిన సొమ్ము కట్టించుకునే రిజిస్ట్రేషన్లు చేయించాలని అన్నారు. ఈ నెల 28, 29 తేదీల్లో అగ్రిగోల్డ్ బాధితులు ఆత్మహత్యలు చేసుకున్న వారి కుటుంబాలతో విజయవాడలో 36 గంటల దీక్ష నిర్వహిస్తున్నామని వెల్లడించారు. దీక్షలో బాధిత కుటుంబాలు భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ధర్నా అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని “స్పందన”లో అందచేశారు. ఈ కార్యక్రమంలో వై.కే రాజు,శేఖర్,కిరణ్, భాగ్యరాజు, అర్జున్, వీర్రాజు, రాజబాబు వీర వేణి, తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *