fbpx

నూతన ఖనిజ వనరుల కొరకు విస్తృత చర్యలు

Share the content

దేశ ప్రగతికి కీలకమైన ఖనిజ వనరులను అందించేందుకు ఎప్పటికప్పుడు నూతన ఖనిజ అన్వేషణలు విస్తృతంగా జరగాలని రాష్ట్ర స్పెషల్ చీఫ్ సెక్రటరీ (మైన్స్) గోపాలకృష్ణ ద్వివేది పిలుపునిచ్చారు. విజయవాడలో 53వ స్టేట్ జియోలాజికల్ ప్రోగ్రామింగ్ బోర్డ్ సమావేశంకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… దేశ జిడిపిలో మైనింగ్ వాటా 1.5 శాతం ఉండగా, మన రాష్ట్ర జిడిపి లో మాత్రం మైనింగ్ వాటా 2.7 శాతం ఉండటం గర్వకారణమని అన్నారు. రానున్న రోజుల్లో దీనిని మరింతగా పెంచేందుకు ఉన్న అన్ని అవకాశాలను పరిశీలించాలని, ఖనిజాన్వేషణ సంస్థలకు అవసరమైన పూర్తి సహకారాన్ని ప్రభుత్వం అందించేందుకు సిద్దంగా ఉందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అపారమైన ఖనిజ వనరులు ఉన్నాయని అన్నారు. వాటిని గుర్తించడం కోసం జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వంటి సంస్థలు మరింత చురుగ్గా తమ అన్వేషణలను కొనసాగించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్స్ ప్లోరేషన్ ఏజెన్సీలు రాష్ట్రంలో మేజర్ మినరల్ మైనింగ్ కోసం 56 బ్లాక్ లను కేటాయించాయని తెలిపారు. వీటిల్లో ఇప్పటి వరకు 44 బ్లాక్ లకు ఆక్షన్ కోసం ఎన్ఐటి లు విడుదల చేశామని వెల్లడించారు. ఇందులో 24 బ్లాక్ లకు వేలం ప్రక్రియ కూడా విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. మరో 9 బ్లాక్ లకు సంబంధించిన ఆక్షన్ ప్రక్రియ కొనసాగుతోందని అన్నారు.రాష్ట్రంలో మొత్తం 270 మేజర్ మినరల్ బ్లాక్ లు నాన్ వర్కింగ్ కేటగిరిలో ఉన్నాయని ఇండియన్ బ్యూరో ఆప్ మైన్స్ తెలిపింది. దానిలో ఈ ఏడాదిలో 54 బ్లాక్ ల్లో మైనింగ్ ప్రారంభమైంది. మరో నలబై బ్లాక్ లకు సంబంధించి పర్యావరణ అనుమతులకు దరఖాస్తు చేసి ఉన్నాయి. ఇవి కూడా రాగానే ఈ బ్లాక్ ల్లో మైనింగ్ ప్రారంభమవుతుంది. అలాగే ఈ బ్లాక్స్ లోని 65 లీజులను షార్ట్ లిస్ట్ చేసి ఎంత మేరకు ఈ ప్రాంతంలో ఖనిజ నిల్వలు ఉన్నాయో నిర్ధారించేందుకు నివేదిక ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. ఇందుకు జిఎస్ఐ నుంచి కూడా సానుకూలత వ్యక్తం అవ్వడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. అన్ని నాన్ వర్కింగ్ బ్లాక్ లను కూడా పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలని కృషి చేస్తున్నామని తెలిపారు.

  • రాష్ట్ర గనులశాఖ సంచాలకులు విజి వెంకటరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో అపారమైన సముద్రతీర ప్రాంతం ఉందని అన్నారు. 972 కిలోమీటర్ల మేర విస్తరించిన తీరంలో అనేక మేజర్ మినరల్స్ నిక్షేపాలు ఉన్నాయని తెలిపారు. జిఎస్ఐ లోని మెరైన్ విభాగం ద్వారా ఆఫ్ షోర్ లోని ఖనిజ వనరులపై ప్రత్యేక అన్వేషణ కార్యక్రమాన్ని కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో మాంగనీస్, ఐరన్ ఓర్, లైమ్ స్టోన్, బీచ్ శాండ్, గోల్డ్, డైమండ్ వంటి ఖనిజ నిక్షేపాలు ఉన్నాయని వాటిపై దృష్టి సారించి మైనింగ్ నిర్వహిస్తే పారిశ్రామిక ప్రగతి పరుగులు పెడుతుందని అన్నారు. అలాగే క్రిటికల్ మినరల్స్ గా ఉన్న కాపర్, గ్రాఫైట్, లిథియం, కోబాల్ట్, నికిల్ వంటి మినరల్స్ మీద ఎక్స్ ప్లోరేషన్ ఏజెన్సీలను దృష్టి పెట్టాలని డిఎంజి కోరారు. ఈ సమావేశంలో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా డిప్యూటీ డైరెక్టర్ జనరల్ మహాపాత్రో రెండు మాంగనీస్ బ్లాక్ లకు సంబంధించిన నివేదికలను ప్రభుత్వానికి సమర్పించారు. ఈ సమావేశంలో జిఎస్ఐ మెరైన్ వింగ్ డైరెక్టర్ శుభాంకర్ దత్తా, ఎన్సిబి, ఓఎన్ జీసి, ఎంఈసిఎల్, ఐబిఎం, ఎంఓఐఎల్ సంస్థల ప్రతినిధులు, వివిధ యూనివర్సిటీలకు చెందిన ఫ్రోఫెసర్లు, గనులశాఖ, ఎపిఎండిసి అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *