fbpx

ఇతర రాష్ట్రాలు సైతం ఆచరించేలా ఏపీ విద్యా వ్యవస్థ

Share the content

వైసిపి ప్రభుత్వం ఏర్పడినప్పటినుంచి విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని విద్య శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా పెద్ద ఎత్తున అనేక అభివృద్ధి పథకాలు ప్రవేశపెట్టి నాణ్యమైన విద్యను అందించడానికి నిరంతర కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.విజయవాడలో మంగళవారం పాఠశాల విద్యాశాఖ, సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ఆర్జేడీలు, ఆర్ఐఓలు, డీఈవోలకు, డీవీఈవోలకు, ఏపీసీలకు జరిగిన వర్క్ షాపునకు ముఖ్య అతిథిగా విద్యాశాఖామాత్యులు బొత్స సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కేంద్రస్థాయి సమీక్షల్లో కూడా ఏపీ విద్యా వ్యవస్థ ముందంజలో ఉందని, మన విద్యా సంస్కరణలు ఇతర రాష్ట్రాలు వారు సైతం ఆచరించేందుకు మక్కువ చూపుతున్నారని, దీనికి కారణం అధికారుల,ఉపాధ్యాయుల సహకారమేనని కొనియాడారు. విద్యార్థులను ప్రపంచ పౌరునిగా తీర్చిదిద్దడం ఉపాధ్యాయులు ఒక బాధ్యతగా స్వీకరించాలని కోరారు. ఉపాధ్యాయుల పని తీరు మెరుగ్గా ఉండేలా జిల్లా స్థాయి అధికారులు తమ గురుతర బాధ్యతను నెరవేర్చాలని గుర్తుచేశారు. విద్యాభివృద్ధికి చేపట్టే కార్యక్రమాలు అన్ని స్థాయుల్లో జరుగుతున్నాయా? లేదా? అని పర్యవేక్షించాలని అన్నారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రపంచంలో మన రాష్ట్ర విద్యార్థులు కూడా విజ్ఞానాన్ని అందిపుచ్చుకుని దూసుకుపోయేలా తీర్చిదిద్దడమే లక్ష్యంగా సిఎం వై.యస్.జగన్ మోహన్ రెడ్డి ఆకాంక్ష అని తెలిపారు.
పాఠశాలల్లో స్మార్ట్ టీవీలు, ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానెళ్లు, విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఇచ్చిన ట్యాబులను సద్వినియోగపరచుకుంటూ డిజిటల్ విద్యావిధానంలో సాంకేతిక దిశగా పయనించాలని అన్నారు. అందుకోసం ఉపాధ్యాయులకు శిక్షణ కూడా ఇచ్చామన్నారు. సీబీఎస్ఈ, టోఫెల్ అమలకు సంబంధించి సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. విద్యా వ్యవస్థ మార్పు కోసం ప్రభుత్వం నుంచి వచ్చే ఆలోచనలకు అభిప్రాయాలు పంచుకోవాలని కోరారు. రాబోయే కాలంలో విద్యార్థుల భవిష్యత్తును మెరుగుపరిచేలా ఉండాలన్నారు. విద్యా వ్యవస్థ కోసం మన రాష్ట్రం వివిధ పథకాల ద్వారా దాదాపు 50 వేల కోట్లు ఖర్చు చేసిందని, దేశంలో ఏ రాష్ట్రమూ ఇంత పెట్టుబడి విద్యకోసం పెట్టలేదని అన్నారు.

  • స్టెమ్ ల్యాబ్ ల కోసం కనెక్ట్ ఆంధ్రతో ఒప్పందం
    విద్యార్థులను భావితర శాస్త్రవేత్తలుగా తయారు చేయాలనే సంకల్పంతో రాష్ట్రంలో 200 స్టెమ్ ల్యాబ్స్ ఏర్పాటు చేసేందుకు కనెక్ట్ ఆంధ్రాతో అవగాహన ఒప్పందం కుదర్చుకున్నామని తెలిపారు. మరో 2000 స్టెమ్ ల్యాబ్ లను విస్తరించే యోచనలో ఉన్నామన్నారు. అనంతరం ‘పాఠశాల తనిఖీ, పర్యటన’కు సంబంధించిన మొబైల్ యాప్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యాశాఖ కమీషనర్ ఎస్.సురేష్ కుమార్, ఇంటర్మీడియెట్ విద్య కమీషనర్, సెక్రటరీ సౌరభ్ గౌర్ సమగ్ర శిక్ష రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు, కనెక్ట్ ఆంధ్రా సీఈవో శివశంకర్ విద్యాశాఖలో వివిధ శాఖాధిపతులు, సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *