fbpx

సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా న్యూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్

Share the content

రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన “న్యూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2022” ను తక్షణమే రద్దు చేయాలని కోరుతూ ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ (ఐలు) డిమాండ్ చేసింది. ఈ మేరకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో న్యాయవాదులు సోమవారం కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు . ఈ సందర్భంగా ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్ష ,ప్రధాన కార్యదర్శులు మేడపాటి ధర్మారెడ్డి , గుదిమెళ్ళ భాస్కరాచార్యులు మాట్లాడుతూ న్యాయవాదులు నవంబరు 29, 30, డిసెంబర్1 నుండి 9వ తేదీ వరకు కోర్టు విధులు బహిష్కరించి న్యాయవాదులు నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన లేకపోవడంతో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు డిసెంబర్ 15 వరకు కోర్టు విధులు బహిష్కరించి నిరసన కార్యక్రమాలు నిర్వహించినట్లు ఇప్పటికే తెలియజేసినట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మొండిగా ఈ చట్టం అమలకు చర్యలు తీసుకోకుండా, ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్, న్యాయవాద సంఘాలు, బార్ అసోసియేషన్ లతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన చీకటి చట్టం ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ప్రజలకు ఎటువంటి ఉపయోగం ఉండదని తెలిపారు. ఈ చట్టంలో భూ హక్కుదారులకు అన్యాయం జరిగేందుకు ఆస్కారం ఎంతో ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా తీసుకొచ్చిన ఈ చీకటి చట్టంలో స్థానిక సివిల్ కోట్లకు విచారణ పరిధి( జ్యూరిడిక్షన్) లేకుండా చేశారని, కేవలం టైటిలింగ్ అధికారులకే అధికారం పెట్టారని తెలిపారు. చట్టంలో ల్యాండ్ టైటిలింగ్ అధికారి హోదా, విద్యార్హతలు గురించి పేర్కొనలేదు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో పనిచేసే ల్యాండ్ టైటిలింగ్ అధికారులపై రాజకీయ జోక్యం ఉండే అవకాశం ఉందని ప్రజలు, న్యాయవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.

  • సామాన్యులుకు న్యాయం ప్రశ్నార్థకం!
    ఐలు కాకినాడ సిటీ ప్రధాన కార్యదర్శి నాగజ్యోతి మాట్లాడుతూ ప్రభుత్వం చెబుతున్నట్లు సులభంగా వేగంగా కేసులు పరిష్కారం చేయాలని భావిస్తే కోర్టులను పెంచి, సిబ్బందిని నియమించాలని కోరారు. అంతేకాకుండా అవసరమైన చోట్ల ఫాస్ట్ ట్రాక్ కోర్టు లను ఏర్పాటు చేయడం ద్వారా కేసులు త్వరితగతిన పరిష్కారం అవుతాయని, సివిల్ కోర్టులు చేయాల్సిన పనిని ల్యాండ్ టైటిలింగ్ అధికారులకు అప్పజెప్పడం ద్వారా పేదలకు మేలు కన్నా నష్టమే ఎక్కువ జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ల్యాండ్ టైటిలింగ్ అధికారులు ఇచ్చిన తీర్పుపై అప్పీల్ కోసం హైకోర్టుకు మాత్రమే వెళ్లే అవకాశం ఉందని చట్టంలో పేర్కొన్నట్లు తెలిపారు. సివిల్ కోట్లకు జురెడిక్షన్ లేదు. ల్యాండ్ టైటిలింగ్ అధికారులు ఇచ్చే ఆర్డర్ పై అప్పీల్ గడువు 7 రోజులు మాత్రమే ఇచ్చినట్లు పేర్కొన్నారు. సామాన్యులు వ్యయ, ప్రయాసలు పడి హైకోర్టుకు వెళ్లి న్యాయం పొందడం కష్టతరంగా మారుతుందని, డబ్బు లేని కారణంగా హైకోర్టులకు వెళ్లలేక సామాన్యులకు న్యాయం అందని ద్రాక్ష గా మారే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేయాలని . కోరుతున్నామని తెలిపారు. స్పందించిన కలెక్టర్ ప్రభుత్వానికి నివేదించినట్లు తెలిపారు. అంతకుముందు కాకినాడ బార్ అసోసియేషన్ లో న్యాయవాదులు సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులుఆర్. వి. రమణారావు ఐలు సభ్యులు జి వి దేశి , కె దుర్గా భవాని, రాజ్యలక్ష్మి , మురళీ , రమాదేవి , గౌతు రాజా, కె దమయంతి, కె. ఎ. రెడ్డి , ఎం వీరలక్ష్మి , శ్రీలక్ష్మి, టి రమాదేవి, శ్రీవాణి , సుధాకర్ , కె రాజబాబు, వినోద్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *