fbpx

సీమ శాసనం..!!

Share the content

రాయలసీమలో ఉన్న 52 నియోజకవర్గాల్లో ఎన్ని సీట్లను జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి విజయం సాధిస్తుంది అన్నదానిపైనే ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వం మార్పు ఆధారపడి కనిపిస్తోంది. రాయలసీమ ప్రాంతం పై వైసీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్ కు మంచి పట్టు ఉంది. కడప కర్నూలు అలాగే అనంతపురం చిత్తూరు జిల్లాల్లో 2019 ఎన్నికల్లో వైసీపీ దాదాపు క్లీన్ స్వీప్ చేసింది. అనంతపురం జిల్లాలో ఉరవకొండ, హిందూపూర్, చిత్తూరు జిల్లాలో కుప్పం తప్ప మరే చోట్ల తెలుగుదేశం పార్టీ విజయం సాధించలేకపోయింది. 52 సీట్లలో ఏకంగా వైసిపి 49 సీట్లను గెలుచుకొని విజయకేతనం ఎగురవేసింది. కడప, కర్నూలు జిల్లాలు పూర్తిగా క్లీన్ స్వీప్ అయ్యాయి. అప్పట్లో కచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి ఒక అవకాశం ఇవ్వాలి అన్న సందేశం తో పాటు… వైయస్ మార్కు రాజకీయం అలాగే తమ వాడు అనుకున్న తీరు రాయలసీమలో బాగా పనిచేసింది.

ఇప్పుడు రాయలసీమ ప్రాంతంలో బలం పుంజుకోవడం పైనే తెలుగుదేశం పార్టీ జనసేన దృష్టి పెట్టనున్నాయి. చిత్తూరు జిల్లా రాజకీయాల వరకు కాస్త మార్పు కనిపిస్తున్నప్పటికీ కడప కర్నూలు జిల్లాల్లో పరిస్థితి ఎలా ఉంటుంది అన్నది అంచనా వేయలేకపోతున్నారు. అనంతపురం జిల్లా రాజకీయాలు పూర్తిగా మిక్సడ్ గా కనిపిస్తున్నాయి. దీంతో ఈసారి చిత్తూరు అనంతపురం జిల్లాల పైన తెలుగుదేశం పార్టీ జనసేన ప్రధానంగా దృష్టి పెట్టనున్నాయి. చిత్తూరు జిల్లాలో పుంగనూరు తప్ప మిగిలిన అన్ని ప్రాంతాల్లోనూ గెలుపు సాధ్యం అనేలా పరిస్థితులు కనిపిస్తుంటే ఎన్నికల ముందు ఎలాంటి పరిస్థితులు ఉంటాయో అర్థం కాని స్థితి నెలకొంది. వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి చేరికలు ఉంటాయి అని భావించినప్పటికీ చంద్రబాబు జైలుకు వెళ్లడంతో నేతలు కూడా వెనక్కు తగ్గారు. ముఖ్యంగా సీమ ప్రాంతం నుంచి అధికంగా తెలుగుదేశంలోకి వలసలు ఉంటాయని మొదట భావించారు. అయితే అనూహ్యంగా అక్కడి నుంచి వలసలు కనిపించలేదు. జగన్కు సొంత జిల్లా ఆయన కడపలో ఉన్న పది సీట్లలోను మంచిపట్టు కనిపిస్తోంది. రైల్వే కోడూరు, మైదుకూరు ప్రాంతాల్లో ప్రతిపక్షం అయిన తెలుగుదేశం పార్టీకి పట్టు ఉన్నప్పటికీ క్యాడర్ బలంగా నిలబడలేక పోతున్నారు. పక్కనే ఉన్న కర్నూలు జిల్లా పూర్తిస్థాయిలో జగన్ పట్టు సాధించారు. ఆళ్లగడ్డ తప్ప ఇక్కడ ప్రతిపక్షం బలంగా నిలబడే ప్రాంతం ఒకటి లేదు. ఇక చిత్తూరు జిల్లాలో పూర్తిస్థాయిలో విభిన్నమైన రాజకీయాలు కనిపిస్తున్నాయి. చిత్తూరు జిల్లా నుంచి ఈసారి ఎక్కువగా సీట్లు సాధించాలని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. యువతలో జనసేనకు ఉన్న బలాన్ని అందిపుచ్చుకొని చిత్తూరు జిల్లాలో ఉన్న 14 నియోజకవర్గాల్లో గెలిచి, ముందుకు వెళ్లాలని తెలుగుదేశం ఆలోచిస్తుంది. అనంతపురంలోనూ భిన్నమైన రాజకీయాలు నెలకొన్నాయి. దీంతో ఎక్కడ కూడా గెలుపు అంత నల్లేరు మీద నడక కాకపోవచ్చు. ఏదిఏమైనాప్పటికీ వచ్చే ఎన్నికల్లో జగన్ గెలుపు ఓటములను రాయలసీమ జిల్లాల్లో వచ్చే సీట్లు మాత్రమే ప్రభావితం చేస్తాయి. గతంలో వచ్చిన సీట్లు కంటే ఏమాత్రం తగ్గిన కచ్చితంగా వైసీపీ అధికారం పోవడం ఖాయం. దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు ఎలాంటి ఎత్తులు వేస్తారు ఎలాంటి వ్యూహాలు వేస్తారు అనేది కీలకము కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *