fbpx

సంకెళ్లు వేసిన చేతులతోనే సలాం చేస్తారా?

Share the content

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు అంటూ ఎవరూ ఉండరు.. ఒకప్పుడు వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని అవినీతి కేసుల్లో అరెస్టు చేసి అందరితో శభాష్ అనిపించుకుని హీరో అయిన మాజీ సిబిఐ అధికారి లక్ష్మీనారాయణ ఇప్పుడు అకస్మాత్తుగా జగన్ మీద జగన్ ప్రభుత్వం మీద ప్రశంసల వర్షం కురిపించడం చూస్తుంటే రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే అనేది మరోసారి స్పష్టం అవుతోంది. తమ సొంత ప్రాంతం శ్రీశైలంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న లక్ష్మీనారాయణ జగన్ ప్రభుత్వం నిర్వహిస్తున్న సంక్షేమ ఫలాలు చాలా బాగున్నాయని ప్రజలకు చాలా మంచి మేలు చేస్తున్నాయని బహిరంగ వేదిక పై చెప్పారు. నిన్న మొన్నటి వరకు జగన్ ప్రభుత్వ తీరు మీద విమర్శలు చేసిన జెడి లక్ష్మీనారాయణ తన మాటలో మార్పును గమనిస్తుంటే వచ్చే ఎన్నికల్లో ఏమైనా వైసీపీ నుంచి ఆయన పోటీ చేసే అవకాశం ఉందా అనే అనుమానం అందరిలో కలుగుతుంది.

ఇప్పటికే వైసిపి నాయకులు జెడి లక్ష్మీనారాయణ వద్దకు పలు రకాల రాయబారాలు తీసుకువెళ్లారు. క్రియాశీలక రాజకీయాల్లో ఉండాలని భావిస్తున్న లక్ష్మీనారాయణ గత ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫునుంచి విశాఖ ఎంపీగా పోటీ చేసి.. మంచి ఓటింగ్ శాతం సాధించారు. ఎన్నికల తర్వాత జనసేన పార్టీకి రాజీనామా చేసిన లక్ష్మీనారాయణ స్థిరంగా ఉండిపోయారు. అయితే వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనాలని భావిస్తున్నానని… ఏ పార్టీ నుంచి అనేది ఇప్పుడే చెప్పలేనని అవసరమైతే స్వతంత్రంగా కూడా పోటీ చేస్తానని పలు టీవీ ఛానళ్ల ఇంటర్వ్యూలో ఆయన స్పష్టం చేశారు. అయితే తాజాగా వైసిపి ప్రజాప్రతినిధి పిలిచిన సభకు వెళ్లిన లక్ష్మీనారాయణ అక్కడ జగన్ ప్రభుత్వాన్ని ప్రభుత్వ పాలనను సమర్థిస్తూ మాట్లాడడం ఇప్పుడు రాజకీయంగా చర్చినీయ అంశం అవుతుంది. నిన్న మొన్నటి వరకు ఉప్పు నిప్పు మాదిరిగా ఉండే జగన్ లక్ష్మీనారాయణ వైఖరి ఇప్పుడు అకస్మాత్తుగా రాజీ ధోరణి కనిపిస్తుండడం వచ్చే ఎన్నికల్లో లక్ష్మీనారాయణ వైసీపీ నుంచి పోటీకి సిద్ధం అవుతున్నారు అన్న అనుమానాన్ని బలపరుస్తోంది. జగన్ కేసును దర్యాప్తు చేసిన అధికారితోనే జగన్ మీద వచ్చిన కేసులు కేవలం రాజకీయ కారణాలవల్ల పెట్టినవి అని చెప్పించడం ద్వారా జగన్ కు క్లీన్ చీట్ ఇప్పించి ప్రచారం చేసుకోవాలి అని కూడా వైసిపి భావిస్తుండడం దీనిలో ఉన్న అసలు సారాంశం. ఇప్పటికే అవినీతి ఆరోపణలో చంద్రబాబు జైలుకు వెళ్లడం అవినీతి ఆరోపణలు ఉన్న జగన్ కు క్లీన్ చీట్ ఇవ్వడం ద్వారా రాజకీయంగా అది లబ్ధి చేకూరుతుంది అని వైసిపి భావిస్తోంది. ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొని ఎంపీ కావాలని భావిస్తున్న లక్ష్మీనారాయణ కూడా రాజకీయ పార్టీ ఆసరా కోసం ఎదురుచూస్తున్నారు. తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలకు పూర్తిస్థాయిలో ఆయన సంకేతాలు పంపినప్పటికీ అటువైపు నుంచి ఏ మాత్రం సరైన స్పందన రాకపోవడంతో పాటు తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తులో ఈసారి ఎన్నికలు వెళ్తుండడంతో కచ్చితంగా ఆయన వైసిపి వైపు ఉండే అవకాశం కూడా తీసిపారేయలేం. దీంతో భవిష్యత్తు వైపు అడుగులు లక్ష్మీనారాయణ ఎటు వేస్తారు అన్నది కీలకంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *