fbpx

ఇవేమి నిరసనలు.. మీరు మారరా!

Share the content

టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదురుకుంటూ రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఆ పార్టీ కార్యకర్తలు నాయకులు చేస్తున్న నిరసన ప్రదర్శనలు సామాన్యులకు నవ్వు తెప్పించే విధంగా ఉంటున్నాయి. ఒకపక్క కేసుల మీద కేసులు పెట్టి టిడిపి అధినేత చంద్రబాబును తన తనయుడు నారా లోకేష్ ను జైలుకు పంపించే పనిపై వైసీపీ ప్రభుత్వం తీవ్రంగా కసరత్తులు చేస్తుంటే వాటిని ఎదుర్కొనేందుకు టిడిపి నాయకులు మాత్రం చిత్ర విచిత్ర వేషాలు నిరసనలు తెలియజేస్తూ ప్రజలలో అభాస పాలవుతున్నారు. తమ అధినేత అరెస్టును వ్యతిరేకిస్తూ చేస్తున్న పోరాటంలో టిడిపి శ్రేణులకు క్రింది స్థాయి నాయకులకు ఆదేశాలు ఇచ్చే విషయంలో ప్రథమ స్థాయి నాయకులు పూర్తిగా విఫలంఅయ్యారు అనే అనుకోవాలి . పాతకాలం పద్ధతిలో లాగా నిరసనలు చేస్తూ టీవీ చానళ్ళకు మీడియాకు ఫోటోలకు ఫోజులిస్తున్నారు తప్పితే పూర్తిస్థాయిలో బలమైన నిరసన కార్యక్రమాలు జరుగుతున్నట్లు ఎక్కడా కనిపించడం లేదు.

తాజాగా తణుకు లోని కంచాలను కొడుతూ నిరసన తెలిపారు. హనుమాన్ జంక్షన్ లో మోకాళ్లపై నడుస్తూ నిరసన తెలియజేశారు. రాయలసీమ జిల్లాలో కళ్ళకు గంతలు కట్టుకుంటే, నెల్లూరు జిల్లాలో ప్రార్ధనలు చేస్తున్నారు. బలమైన ప్రతిపక్ష పార్టీ అధినేత అరెస్టు అయితే ఆ పార్టీ నేతలు చేస్తున్న నిరసనలు సామాన్య ప్రజలకు నవ్వు తెప్పించే విధంగా ఉన్నాయి. క్షేత్రస్థాయిలో నాయకులు ఎవరికి తోచిన రీతిలో వారు కార్యక్రమాలు చేస్తున్నారు తప్పితే సమిష్టిగా తీవ్రమైన నిరసనలు చేస్తున్నట్లు ఎక్కడా కనిపించడం లేదు అనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. టిడిపి శ్రేణులు చేస్తున్న నిరసనలను కనీసం పోలీసులు కూడా పట్టించుకోని పరిస్థితి కనిపిస్తోంది.

రాష్ట్రంలో రెండవ ప్రతిపక్ష పార్టీగా ఉన్న జనసేన పార్టీతో ఇటీవలే పొత్తులు కుదుర్చుకున్న విషయం తెలిసిందే కనీసం జనసేన పార్టీ కార్యకర్తలను నాయకులనైనా కలుపుకొని వెళ్తున్నారా అంటే అలాంటి పరిస్థితి ప్రస్తుతం ఎక్కడ కనిపించడం లేదు. జనసేన పార్టీ నాయకులు పార్టీ అధినేత పవన్ఆ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఒకరోజు పాటు చేసిన నిరసన కార్యక్రమం చాలా తీవ్రస్థాయిలో జరిగింది. జనసేన చేస్తున్న నిరసన కార్యక్రమాలతో ఒక్కసారిగా రాష్ట్ర ప్రజల్లో అటెన్షన్ ఆ పార్టీ వైపు తిప్పుకోగలిగింది. రాష్ట్రంలో ఏ పార్టీకి లేనంత కార్యకర్తల బలం జనసేన పార్టీకి వుంది. అదే ఆ పార్టీకి ఫుల్ మైలేజ్ ఇస్తుంది. ఏ కార్యక్రమం చేసిన చాలా బలంగా చేయడం జనసేన పార్టీకి మొదటి నుండి ఉన్న ప్రత్యేకత. ఇదే విషయంపై తెలుగుదేశం పార్టీ నాయకత్వం దృష్టి పెట్టి నిరసన కార్యక్రమంలో జనసేనను కూడా కలుపుకొని వెళితే క్షేత్రస్థాయిలో టిడిపి చేస్తున్న నిరసన కార్యక్రమాలకు బలం చేకూరుతుంది. ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ పాత చింతకాయ పచ్చడి నిరసనలు పక్కన పెట్టి క్షేత్రస్థాయిలో గుర్తింపు తెచ్చే నిరసన కార్యక్రమాలు చేస్తే టిడిపి మైలేజ్ మరింత పెరిగే అవకాశం లేకపోలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *