fbpx

రాష్ట్రాన్ని లూటి చేసిన వైసీపీ, టీడీపీ

Share the content

రాబోయే ఎన్నికల్లో ప్రజా రాజకీయ బలం ఏమిటో చూపుతామని భారత చైతన్య యువజన (బీసీవై) పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు బొడె రామచంద్ర యాదవ్ అన్నారు. మంగళగిరి హాపీ రిసార్ట్స్ లో గురువారం పార్టీ కార్యవర్గ మొదటి సమావేశం బొడె రామచంద్ర యాదవ్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో కోటిమందికి బీసీవై సభ్యత్వ నమోదుకు విస్తృత కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు పార్టీల దోపిడీ ని ప్రజల్లోనే నిగ్గు తేలుస్తామన్నారు. రాష్ట్రంలోని అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ అవినీతి పార్టీలే అని రుజువు అయ్యిందని, ఒకరి నొకరు అవినీతి ఆరోపణలు చేసుకుంటున్నాయని అవి అన్ని అక్షర సత్యాలేనని అన్నారు. చంద్రబాబు ఉన్న జైలులోనే జగన్ ను బెయిల్ రద్దు చేసి ఉంచాలని అలా చేస్తే రాష్ట్రానికి పట్టిన దరిద్రం వదిలిపోతుందన్నారు రామచంద్ర యాదవ్. రాష్ట్రంలో ఇప్పటి వరకూ ఏన్నో పార్టీలు అధికారంలోకి వచ్చాయి. పాలకులు మారారు వారి దోపిడీ విధానాలు, అణచివేతల కారణంగా ప్రజల జీవన విధానంలో ఎలాంటి మార్పు రాలేదని అన్నారు. విభజన అనంతరం రాష్ట్రానికి ప్రత్యేక తీసుకురావడం లో గానీ విభజన హామీలను నెరవేర్చడంలో గానీ , రాజధాని అభివృద్ధికి నిధులు ఇవ్వడంలో గానీ రాష్ట్ర అభివృద్ధిలో గానీ పూర్తి గా విఫలమయ్యాయని ఆరోపించారు. ఈ విషయాలను రాష్ట్ర ప్రజలు గుర్తించారన్నారు. రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన టీడీపీ గానీ ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ గానీ రాష్ట్రానికి నీటి ప్రాజెక్టులు తీసుకురావడంలో గానీ, రాజధాని నిర్మాణానికి గానీ, ప్రత్యేక హోదా తీసుకురావడానికి గానీ కృషి చేయలేదని అన్నారు. కేవలం వీళ్లు చేసిన అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి కేంద్రం వద్ద మోకరిల్లుతున్నారు తప్ప రాష్ట్ర అభివృద్ధికి, రాష్ట్రంలోని రైతాంగం గానీ, రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి కోసం ఈ ప్రభుత్వాలు కేంద్రంతో పోరాడలేని పరిస్థితిలో ఉన్నయని అన్నారు. ఈ రాష్ట్రం ఏ పరిస్థితిలో ఉందో ప్రతి ఒక్కరూ ఆలోచించాలన్నారు.

రాజధాని పేరుతో భూములు దోపిడి

2014 నుండి 2019 వరకూ ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం.. తెలంగాణలోని హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలు అబివృద్ధి జరిగినట్లుగా ఇక్కడ చేయకుండా తాత్కాలిక రాజధాని నిర్మాణాలు చేసి భూముల దోపిడీ, వ్యాపారానికి పరిమితం అయ్యారని విమర్శించారు. నీటి ప్రాజెక్టుల పేరు చెప్పి దోపిడీ చేసే కార్యక్రమం చేపట్టారని ఆరోపించారు. ఆ ప్రభుత్వం రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అన్యాయం చేసిందన్నారు. 2019 ఎన్నికల్లో ఒక్క అవకాశం పేరుతో బూటకపు హామీలతో అధికారంలోకి వచ్చిన వైసీపీ .. ఈ నాలుగేళ్లలో చేయని అరాచకాలు, దోపిడీ, అక్రమాలు లేవని అన్నారు. వైసీపీ ప్రభుత్వం చేసినంత దోపిడీ, అవినీతి రాష్ట్ర, దేశ చరిత్ర లో ఇప్పటి వరకూ ఎక్కడా జరగలేదని అన్నారు. రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు ఇవేళ మీరు అవినీతి చేశారంటే మీరు అవినీతి చేశారంటూ ఒకరి నొకరు వాళ్లు చేసిన అవినీతి గురించి మాట్లాడుతున్నారని అన్నారు. ఈ రెండు పార్టీలు ఒకరిపై ఒకరు చేస్తున్న ఆరోపణలు నూరు శాతం నిజమేనని ప్రజలు గుర్తించాలన్నారు. దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నట్లుగా ఆ రెండు పార్టీలు ఉన్నాయని విమర్శించారు. ప్రస్తుత వైసీపీ పాలనలో రైతులు, యువత, బడుగు బలహీన వర్గాల ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ ఏమి చేయలేని పరిస్థితి ఉందన్నారు. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు అందరూ చూస్తునే ఉన్నారనీ, గత ప్రభుత్వ హయాంలో నాటి సీఎం చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు చేస్తూ ప్రస్తుత ప్రభుత్వం అరెస్టు చేసి రిమాండ్ కు తరలించిందనీ, ఆయన అవినీతికి పాల్పడ్డారని కోర్టుల్లో ప్రభుత్వ న్యాయవాది వాదిస్తున్నారని అన్నారు.

ముఖ్యమంత్రి స్థానం నేరాల్లో ఏ వన్

రాష్ట్ర సంపద దోపిడీ చేసిన వాళ్లను, అవినీతి చేసిన వాళ్లను కఛ్చితంగా శిక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని వేల కోట్లు అవినీతి చేస్తే కచ్చితంగా శిక్షించాల్సిందేనన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆర్ధిక నేరాలకు పాల్పడిన వారికి బెయిల్ ఇవ్వకూడదు అంటే అందులో ముందు వరుసలో ఉండే వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డేనని రామచంద్ర యాదవ్ అన్నారు. చంద్రబాబు చేసింది తప్పు అయితే వాళ్ల నాన్నను అడ్డం పెట్టుకుని వేల కోట్ల అవినీతి చేసి ఎన్నో కేసుల్లో ఈ రోజు ఏ 1 గా ఉన్న జగన్మోహనరెడ్డి బెయిల్ రద్దు చేసి జైల్ కు పంపించాల్సిన అవసరం ఉందన్నారు. చంద్రబాబుకి రాజమండ్రి సెంట్రల్ జైల్ లో స్నేహ బ్యారక్ కేటాయించినట్లుగానే జగన్మోహనరెడ్డికి జైల్ లో ఒక బ్యారెక్ కేటాయించి పెడితే ఈ రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉంటారని అన్నారు. ఈ రాష్ట్రానికి పట్టిన దరిధ్రం వదిలిపోతుందని రామచంద్ర యాదవ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో కొత్త శకానికి నాంది పలకడం కోసమే భారత చైతన్య యువజన పార్టీ వచ్చిందని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల అభ్యున్నతికి కట్టుబడి ఉన్న పార్టీ బీసీవై పార్టీ అని తెలిపారు. రాష్ట్రంలో బీసీవై పార్టీ విధి విధానాలు, రాబోయే రోజుల్లో పార్టీని ఎలా బలోపేతం చేసుకోవాలి, పార్టీ మేనిఫెస్టో ఏమిటి, రాబోయే ఎన్నికల్లో ఎలాంటి ప్రణాళికతో ముందుకు వెళ్లాలి తదితర అంశాలపై చర్చించేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు గా చెప్పారు. పార్టీ సిద్దాంతాలు, పార్టీ ఆశయాలు ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి ఈ రోజు నుండి నడుంబిగిస్తున్నామన్నారు.

నియోజకవర్గ స్థాయి కమిటీలు ప్రకటన.

ఈ సమావేశంలో రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయి కమిటీలను ప్రకటించిన రామచంద్ర యాదవ్.. పార్టీ మేనిఫెస్టో అంశాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. ఉచిత విద్య, వైద్యం అందించడంతో రాష్ట్రంలోని అన్ని వర్గాల అభ్యున్నతికి, రాష్ట్ర ప్రగతి కోసం బీసీవై పార్టీ చేపట్టబోయే కార్యక్రమాలను ప్రజలకు వివరించాలన్నారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు, శ్రేణులకు 90 రోజుల కార్యచరణ ప్రకటించారు. పూర్తి స్థాయి మేనిఫెస్టోను విడుదల చేశారు బొడె రామచంద్ర యాదవ్. బీసీలకు చట్టసభల్లో 50 శాతం సీట్లు, బీసీలకు విద్య, ఉద్యోగాల్లో 44 శాతం రిజర్వేషన్లు, బీసీ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లతో పాటు ఇంకా ఎన్నో సంస్కరణలతో బీసీవై పార్టీ ముందుకు వెళుతుందని అన్నారు.

పార్టీ కార్యచరణ ప్రకటన

ఇంటింటికి బీసీవై .. కోటి సారధుల సంబరం పేరుతో బీసీవై పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ ప్రారంభించారు. పార్టీ సభ్యత్వ విధానం ఆన్ లైన్ మాత్రమే స్వీకరించారు. సభ్యత్వ నమోదులో ప్రత్యేకతలు ఏమిటంటే .. రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి ఒక్కరికీ రూ.2 లక్షల భీమా సౌకర్యం, బీసీవై పార్టీ గుర్తింపు కార్డు, పార్టీ పూర్తి స్థాయి కిట్, ప్రత్యేక రిఫరల్ ప్రోగామ్ ఉంటాయన్నారు. బీసీవై పార్టీ సభ్యుడిగా చేరి కోటి రూపాయలు గెలుచుకునే అవకాశం కల్పించారు. సభ్యులను చేర్పించి నాయకుడిగా ఉజ్వల భవిష్యత్తు పొందవచ్చు. ఒకరి నుండి 99 మంది సభ్యులుగా చేర్పించిన వారికి ఆది సారధిగా సర్టిఫికెట్, 100 నుండి 999 మంది సభ్యత్వాలు చేర్పించిన వారికి శత సారధిగా పార్టీ కిట్, వెయ్యి నుండి 2499 మంది చేర్పించిన సహస్ర సారధికి సిల్వర్ కాయిన్, కిట్ అందించడం జరుగుతుంది. 2500 నుండి 4999 మంది సభ్యత్వం చేర్పించిన స్వర్ణ సారధికి గోల్డ్ కాయిన్, కిట్, 5వేల నుండి 9999 సభ్యత్వాలు చేసిన వారికి వజ్ర సారధిగా ఆండ్రాయడ్ మొబైల్, పది వేల నుండి 24,999 మంది సభ్యత్వాలు చేసిన వారికి విశ్వసారధిగా ఐ ఫోన్, 25వేలకుపైగా సభ్యత్వాలు చేసిన వారికి అనంత సారధిగా బైక్ బహుమతిగా అందించడం జరుగుతుందని ప్రకటించారు బొడె రామచంద్ర యాదవ్. సభ్యత్వ నమోదు ముగిసిన తర్వాత టాప్ టెన్ రెఫరల్ సభ్యులకు నియోజకవర్గ బాధ్యతలు, ఎమ్మెల్యే సీటు కేటాయించడంతో పాటు గెలిపించే బాధ్యతను పార్టీ తీసుకుంటుందని తెలిపారు. డిసెంబర్ 25న లక్కి డిప్ ద్వారా డ్రా తీసి ఒక సభ్యుడికి కోటి రూపాయల ప్రైజ్ మనీ అందించడం జరుగుతుందని పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *