fbpx

రాధా గైర్హాజరు అందుకే..!

Share the content

గుంటూరు నుంచి కృష్ణాజిల్లా వరకు సాగిన యువగళం పాదయాత్రలో వంగవీటి రంగా తనయుడు వంగవీటి రాధా అలా కనిపించి వెళ్ళిపోయినప్పటికీ కీలకమైన గన్నవరం సభలో మాత్రం ఆయన దూరంగా ఉండిపోయారు. ముఖ్యంగా వంగవీటి రాధాకు మిత్రులుగా ఉన్న కొడాలి నాని వల్లభనేని వంశీలను తిట్టడానికి తెలుగుదేశం పార్టీ గన్నవరం సభ పెట్టింది. సభలో నాని వంశీలకు నేతలంతా గట్టి హెచ్చరికలు అలాగే అరుపులు కేకలతో కూడిన బెదిరింపులు ఉంటాయని ముందుగానే ఊహించిన రాధా గన్నవరం సభకు పూర్తిగా డుమ్మా కొట్టారు. ఎప్పటినుంచో స్నేహితులుగా ఉన్న రాధా వంశీ నానిలు రాజకీయంగా భిన్నమైన వేదికల పైన ఉన్నప్పటికీ స్నేహితులుగా మాత్రం అలాగే కొనసాగుతున్నారు. ఏ పార్టీలో ఉన్నప్పటికీ ముగ్గురు ఒకరి మీద ఒకరు ఎప్పుడు నిందలు వేసుకున్నది విమర్శించుకున్నది లేదు. దీనికి తగినట్లుగానే తెలుగుదేశం పార్టీలో కొనసాగుతూ లోకేష్ పాదయాత్రలో మెరుపులా మెరిసి కనిపించకుండా పోయిన రాధా గన్నవరం సభకు పూర్తిగా రాకపోవడం వారి స్నేహాన్ని మరోసారి బయటపెట్టింది.

రాధా తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నప్పటికీ ఎన్నికల ముందు కచ్చితంగా పార్టీ మారతారు అన్న ప్రచారం అయితే జోరుగానే ఉంది. ఇక వంశీ నానిలు వైసీపీలోనే కొనసాగుతారు. తెలుగుదేశం పార్టీ నాయకుల మీద పార్టీ అధినేత మీద విరుచుకుపడేందుకు ముందుండే కొడాలి నాని వల్లభనేని వంశీలు తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు ప్రధాన శత్రువులుగా మారిపోయారు. వారి కోసమే భారీగా జన సమీకరణ చేసి సుమారుగా రెండు, మూడు కోట్లు ఖర్చు పెట్టి మరి గన్నవరంలో సభ నిర్వహించారు. వేదికపై నుంచి పెద్దపెద్ద అరుపులతో కేకలతో హెచ్చరికలు చేశారు. ఈ సభకు తాను రాలేనని ముందుగానే తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ కు చెప్పిన రాధ పాదయాత్రలో మాత్రం పాల్గొంటానని ముందుగానే చెప్పారు. దాని మేరకే ప్రకాశం బ్యారేజీ దాటిన తర్వాత పాదయాత్రలో లోకేష్ పక్కన నడిచిన రాధా ఎంతోసేపు అక్కడ ఉండలేదు. కేవలం ఫోటోలు కోసమే రాదా వచ్చిన చందంగా అక్కడ పాదయాత్రలో కొద్దిసేపు ఉండి తర్వాత కనిపించకుండా పోయారు. కీలకమైన పాదయాత్రలో రాధా పెద్దగా ప్రాధాన్యం లేకుండానే ప్రవర్తించడం అలాగే గన్నవరం సభకు రాకపోవడం చూస్తే కచ్చితంగా పార్టీ మారే అవకాశం ఉన్నట్లే కనిపిస్తోంది. మరోవైపు తన ఇద్దరు మిత్రులను ఏ పార్టీలో ఉన్న స్నేహితులుగానే భావిస్తారని మరోవైపు సంకేతాలు పంపినట్లు స్పష్టంగా అర్థమవుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *