fbpx

గుంటూరు నుంచి ఆయనేనా?

Share the content

తెలుగుదేశం పార్టీ నుంచి 2019లో గెలిచిన ముగ్గురు ఎంపీలు ఇద్దరు ఎంపీలు దాదాపు సైకిల్ దిగిపోయినట్లే… గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ పూర్తిగా తన చిరునామా ఎక్కడుందో కూడా తెలియని విధంగా కనిపించడం లేదు. ఇక విజయవాడ ఎంపీ కేసినేని నాని బహిరంగంగానే పార్టీ తీరు మీద ఇటీవల యుద్ధం ప్రకటించి లోకేష్ యువగళం యాత్రకు దూరంగా ఉన్నారు. దీంతో ఇద్దరు ఎంపీలు దాదాపు తెలుగుదేశం పార్టీ నుంచి దూరంగా జరిగినట్లు అందరికీ అర్థమయింది. అయితే వీరి ప్రయాణం ఎటు అనేదానిమీద రకరకాల ఊహాగానాలు వ్యాపిస్తున్నప్పటికీ ఉన్న ఇద్దరు ఎంపీలు కూడా కాపాడుకోలేకపోయారు అన్న మచ్చ మాత్రం తెలుగుదేశం పార్టీపై గట్టిగా పడింది. కేశినేని నాని గల్లా జయదేవ్ ఇద్దరూ కూడా వైసిపి లోకి వెళ్లే అవకాశాలు మెండుగా ఉన్నాయి. జగన్ గాలిలోనూ తట్టుకొని నిలబడి మెజారిటీ శాసనసభ సీట్లు వైసిపి తీసుకు వెళ్లినప్పటికీ, గుంటూరు విజయవాడ రెండు స్థానాల్లో సైతం గల్లా జయదేవ్ కేసినేని నాని గెలవడానికి వారి వ్యక్తిగత ఇమేజ్ తో పాటు వారు నియోజకవర్గంలో చేసిన మేలు గట్టిగా పని చేసిందని భావించాలి. ఆ తర్వాత కాలంలో గల్లా జయదేవ్ తెలుగుదేశం పార్టీలో కొన్ని కీలకమైన కార్యక్రమాలకు హాజరైనప్పటికీ తర్వాత ఎందుకో ఆయన సైలెంట్ అయ్యారు. చిత్తూరు జిల్లాకు చెందిన గల్లా కుటుంబంతో చంద్రబాబు కుటుంబానికి దగ్గర సంబంధాలు ఉన్నాయి. దీంతో కచ్చితంగా గల్లా జయదేవ్ టిడిపి తోనే ఉంటారు అని భావించినప్పటికీ అది జరగలేదు. జయదేవ్ కొద్దికాలంగా టిడిపికి దూరంగా ఉంటూ వస్తున్నారు. మరోపక్క కేసినేని నాని కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో జరిగిన గొడవల తర్వాత పూర్తిగా పార్టీని దూరం పెట్టడం అలాగే తెలుగుదేశం పార్టీ అధిష్టానం పెద్దలే కేసినేని నాని తమ్ముడు చిన్నికి పూర్తిస్థాయిలో సహకరించడంతో కేసినేని నాని కూడా పూర్తిస్థాయిలో పార్టీని వీడినట్లేనని తెలుస్తోంది. ఇద్దరు ఎంపీలు స్థానంలో గట్టి వ్యక్తులను అలాగే కీలకమైన సిట్టింగ్ స్థానాలను నిలుపుకోవాలని టిడిపి అధిష్టానం భావిస్తోంది.

గుంటూరు ఎంపీగా భాష్యం ప్రవీణ్

గుంటూరు ఎంపీగా భాష్యం ప్రవీణ్ ను అనుకుంటున్నారు. యువకుడు అయిన ప్రవీణ్ గత కొద్దికాలంగా పార్టీ నాయకులతో బాగా టచ్ లో ఉన్నారు. చిలకలూరిపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ప్రవీణ్ భావించినప్పటికీ కొన్ని సమీకరణాల దృష్ట్యా వచ్చే ఎన్నికల్లో గుంటూరు ఎంపీ అభ్యర్థిగా ప్రవీణ్ ను నిలిపే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రవీణ్ అయితేనే కచ్చితంగా గుంటూరు ఎంపీ స్థానం నుంచి పోటీ ఇస్తారని లోకేష్ భావిస్తున్నారు. గుంటూరు ఎంపీ స్థానానికి పార్టీలో మరో ఒకరిద్దరి పేర్లు వినిపిస్తున్నప్పటికీ దాదాపు ప్రవీణ్ ను ఖాయం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *