fbpx

నిరుద్యోగులని మోసం చేసిన ముఖ్యమంత్రి..

Share the content

రాష్ట్రంలో అన్ని వర్గాలను మోసం చేసినట్లే నిరుద్యోగులను కూడా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మోసం చేస్తున్నారని ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి బడేటి చంటి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్నికల ముందు ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్న జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఊసే ఎత్తటం లేదని ఎద్దేవా చేశారు. ఇటీవల జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్ సమిట్లో ఫేక్ పెట్టుబడులతో మోసం చేసిన ప్రభుత్వం ఇప్పుడు బడ్జెట్లో అదే విధానాన్ని అవలంబించి అంకెల గారితో ప్రజలను తప్పుదోవ పట్టించిందని ఆయన విమర్శించారు. రాష్ట్ర బడ్జెట్లో ఉద్యోగ కల్పన ఊసే లేకుండా పోవడం విచిత్రంగా ఉందని, ఇప్పుడు నిరుద్యోగులకు కూడా వైసిపి ప్రభుత్వ అసలు రంగు తెలిసిందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగుల సంఖ్య దాదాపు 11 లక్షలు ఉండగా, ఈ ప్రభుత్వ హయాంలో ఉద్యోగాలు రావన్న నిరాశతో మరో 20 లక్షల మంది ఖాళీగా ఉన్నారని ఆయన చెప్పారు. ప్రస్తుత బడ్జెట్ ని చూస్తే ఉద్యోగ అవకాశాలు లభించవని తేలిపోయిందని, ఒక్క నూతన పరిశ్రమను కూడా తేలేకపోయిన దద్దమ్మ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమని బడేటి చంటి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు హయాంలో రాష్ట్రంలో 78 లక్షల మంది యువతకు నైపుణ్యాభివృద్ధిని కల్పిస్తే వైసీపీ ప్రభుత్వం నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను నిర్వీర్యం చేసిందని ఆయన ధ్వజమెత్తారు. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని నిరుద్యోగ యువతను నిలువునా మోసం చేశారని బడేటి చంటి మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో నిరుద్యోగ యువత జగన్మోహన్ రెడ్డికి తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉందని ఆయన హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *